అలరచంచలమైన ఆత్మలందుండ నీయలవాటు సేసెనీవుయ్యాల
పలుమారునుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ వుయ్యాల
ఉదయాస్త శైలంబులొనర కంభములైన ఉడుమండలము మోచెనుయ్యాల
అదన ఆకాశపదంబడ్డదూలంబైన అఖిలంబు నిండెనీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయె వుయ్యాల
మేలుకట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పైయెదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగువోయని భీతి నొయ్యనొయ్యన వూచిరి వుయ్యాల
కమలకును భూసతికి కదలు-కదలుకు నిన్ను కౌగిలింపగజేసెనుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద జూపెనీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల
రచన : తాళ్లపాక శ్రీ అన్నమాచార్యులు
No comments:
Post a Comment